Telugu Badi Celebrated Graduation Day and 10'th Anniversary on May 19,2018
తెలుగు బడి వారి తెలుగు భాషా యఙ్ఞం మరొక మైలురాయిని అధిగమించింది. షుగర్లాండ్లో మొట్టమొదట తెలుగు బడి ప్రారంభించి 10 సంవత్సారాలు పూర్తి చేసుకుంది. ఎందరో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక సభ్యులు, పెద్దలు సమక్షములో 2017-18 స్నాతకోత్సవముతో పాటు, 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనముగా జరుపుకుంది.
తెలుగుబడి ఉపాధ్యాయుల దీపప్రజ్వలనతో కార్యక్రమము మొదలయ్యింది. షుగర్లాండ్, సైప్రస్, కేటీ విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలు,నాటికలు అతిథులకు రక్తికట్టించాయి.
TCA కార్య నిర్వాహక వర్గం ముఖ్య అతిథులు గా విచ్చేసిన శ్రీ రమేష్ దేశభొట్ల, శ్రీ రవి వర్రే, శ్రీ శ్రీధర్ పాటిబండ్ల గార్లను పుష్పగుఛ్ఛము, శాలువాలతొ సత్కరించారు. వారందరూ, తెలుగుబడి ఉపాధ్యాయులు అందిస్తున్న స్వఛ్ఛంద సేవలను కొనియాడారు. తల్లితండ్రులు కూడా తెలుగుబడితో తమకు ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు.
విద్యార్ధులందరికీ ఉత్తీర్ణతా పత్రాలు, చిన్న బహుమతులు అందించారు, తమ తమ తరగతులలో అత్యధిక హాజరుశాతం ఉన్న విద్యార్ధులకు, మొదటి మూడు స్థానాలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు బహుకరించారు.ఇవి ముఖ్య అతిథులు మరియు సాంస్కృతిక సమితి సభ్యుల చేతుల మీదుగా బహుకరింపబడినవి. అలాగే తెలుగుబడి లో ఉత్తీర్ణులై, ఉపాధ్యాయులకు సహాయం చేస్తూ, స్వఛ్ఛందముగా తమ కాలాన్ని, సేవలను అందిస్తున్న " హై-స్కూల్ వాలంటీర్"లకు కూడా ప్రశంసా పత్రాలు బహుకరించారు. చిన్న వయసులో స్వఛ్ఛంద సేవ అనే విత్తనం నాటితే, వారితో పాటు, అది పెద్దదై, సమాజానికి ఇంకా ఎన్నో విధాలుగా వారు ఉన్నత సేవలు అందించగలరు. చివరగా, ఉపాధ్యాయులకి అందరికీ ప్రశంసా పత్రాలు, "గిఫ్ట్ కార్డులు" బహుకరించారు.
ఇది తెలుగుబడి విద్యార్ధులు ఎగురవేస్తున్న విజయకేతనం. భాష మీద మమకారం ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మన భాషని మనం నేర్చుకోవచ్చు. తెలుగు భాషాభిమానం, భావితరాలకు మన భాష నేర్పాలన్న తపన తెలుగు బడిని ముందుకు నడిపిస్తోంది. తెలుగు భాష మన అమ్మ భాష. మన పిల్లలకి మనం తెలుగు నేర్పించుకోవటానికి,అదే ప్రతి తెలుగువారికీ ఒక అర్హతను, అధికారాన్నీ ఇస్తుంది. తెలుగుబడి ఉపాధ్యాయుల కృషి ఫలించాలంటే తల్లి తండ్రుల ప్రోత్సాహం, పట్టుదల, బోధనా ప్రక్రియలో వారి క్రియాశీల పాత్ర ఎంతో అవసరం. అది ఉన్నంతవరకూ, తెలుగు భాష ఎప్పటికీ అవని నలువైపులా వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది.