Telugu Competitions, January 12,2019 at Anthony Middle School, Cypress
జనవరి 12 2019 న జరిగిన, తెలుగు భాషా పోటీలకు ఆనువైన వేదికగా సైప్రస్ లోని అంథొనీ మిడిల్ స్కూల్ అందముగా ముస్తాబయ్యింది. గడిచిన కొద్ది సంవత్సరాలకన్నా, అత్యధిక సంఖ్యలో ఎనభైకి పైగా ఔత్సాహికులైన బాల బాలికలు ఈ పోటీలలో నమోదు అయ్యారు. దీప ప్రజ్వలన, తెలుగుబడి విద్యార్ధుల ప్రార్ధనా పద్యాల పఠనం అనంతరం, తెలుగులో చదవటం, వ్రాయటం, ఆంగ్లపదాలను తెలుగులోకి తర్జుమా చేయటం అనే మూడు విభాగాలలో 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు పోటీలు జరిగాయి. ఈ పోటీలకు సాహిత్యాభిలాషులు, తెలుగు భాషాభిమానులు, రచయితలని న్యాయనిర్ణేతలుగా ఆహ్వానించింది తెలుగు బడి బృందం. పిల్లలు పదాలతో కసరత్తులు చేస్తూ ఉంటే, తల్లి తండ్రులకు తెలుగు బడి బృందం, మెదడుకి మేత అని మరొక పరీక్ష పెట్టింది. వేడి వేడి తేనీరు, రుచికరమైన పకోడీ సేవిస్తూ, తెలుగుబడి బృందానికి- తల్లి తండ్రులకి మధ్య మాట- మంతి, చణుకులు-బెణుకులతో కాలక్షేపం జరిగింది.
తెలుగు బిడ్డలని ఆప్యాయముగా అక్కున చేర్చుకొను అమ్మ-మన తెలుగు తల్లి. ఆ తల్లి చల్లని చూపులు ఎప్పుడూ మనలని స్పృశించాలని, మనం కనులారా ఆమెను చూసుకోవాలన్న మంచి తలంపుతో, ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి, తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక బృందం ఐదు అడుగుల అందమైన పొందికైన విగ్రహం భారత దేశములో చేయించి, ఇక్కడకి తీసుకుని వచ్చారు. ఆ విగ్రహానికి అయిన ఖర్చు మోత్తము తెలుగుబడి భరిస్తుంది అని పెద్దలందరి కరతాళధ్వనుల మధ్య ప్రకటించటం జరిగింది. శిల్పారామములో ప్రాణం పోసుకుని, అమెరికాలో తెలుగు బిడ్డల కోసం వచ్చిన తెలుగు తల్లి విగ్రహం, ఎప్పటికీ TCA కీ, తెలుగువారందరికీ తలమానికముగా నిలిచిపోతుంది.
పద్యపఠనం పోటీ ఎప్పటికన్నా సందడిగా అన్నిటికన్నా మిన్నగా రక్తికట్టించింది.ముక్కు పచ్చలారని చిన్నారులు ముద్దు ముద్దు పలుకులు తల్లితండ్రులను ఆనందభరితం చేశాయి. మంచి ముత్యాల వంటి మాటలే కదా, ఆ తెలుగు తల్లికి మంగళ హారతులు !! గత కొన్ని సంవత్సరాల కన్నా అధికముగా, 56 మంది బాల బాలికలు ఈ పద్యపఠనములో పాల్గొన్నారు. పద్యముతో పాటు దాని భావాన్ని , సందర్భాన్ని కూడా చాలా చక్కగా విశదీకరించి చెప్పారు ఈ తెలుగు చిచ్చర పిడుగులు.
ఒక పక్క పద్య పఠనం జరుగుతూ ఉంటే, మరో ప్రక్క వక్త్రుత్వం పోటీలో విజృంభించారు . వివిధ అంశాలలో తమ భషా నైపుణ్యం ప్రదర్శించి, మాకు సాటి మేమే అన్నారు - అమెరికాలో పుట్టి/పెరుగుతున్న ఈ తెలుగు భావితరం!
కొత్తగా ముస్తాబైన తెలుగు బడి వెబ్సైట్ ని తెలుగు భాషా పోటీల సందర్భముగా విడుదల చేసారు. తెలుగు బడి ఆశయం, కార్యకలాపాలు, పాఠ్యప్రణాలిక వివరాలు, ప్రస్తుతం సెవలందించే మరియు గతములో సేవలందించిన ఉపాధ్యాయుల వివరాలు, స్నాతకోత్సవం మరియు భాష పోటీల గురించి, వాటి ప్రాముఖ్యత వివరిస్తూ చక్కగా పొందుపరిచారు, ఈ వెబ్సైట్ లో! అంతే కాక, తరగతులలో నమోదు చెయటానికి ఆన్ -లైన్ సదుపాయం కల్పించారు.
ఇంత చక్కగా అన్ని అంశాలలో పోటీపడిన బాల బాలికలలో మొదటి మూడు స్థానాలు నిర్ణయించతం న్యాయ నిర్ణేతలకే జటిలమయ్యింది. ఇందులో పాల్గొన్న ప్రతి చిన్నారి విజేతయే! ఈ చిన్నారలను ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లి తండ్రీ అభినందనీయులే!పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మరియు మొదటి మూడు స్థానాలలో విజేతలకు ట్రోఫీ మరియు సర్టిఫికెట్ బహుకరించటం జరిగింది.